BibleBadi

What We Believe

బైబిల్ బడి వారి విశ్వాస ప్రమాణం

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న సర్వశక్తుడైన త్రియేక దేవునియందు విశ్వాసముంచుచున్నాము (1 పేతురు 1:2; 2 కొరింథీ 13:14; మత్తయి 3:16-17). ఆయనే స్వయంభవుడు, ప్రేమామయుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి మరియు సర్వజ్ఞాని అని విశ్వాసముంచుచున్నాము (ద్వితీ 6:4-5; యోహాను 3:16; కీర్తనలు 139:14; యెషయా 57:15; 1 కొరింథీ 8:6; ప్రకటన 3:20, 4:10-11).

పాపరహితమైన జీవితాన్ని జీవించిన అద్వితీయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతున్నాము. ఈయన మానవ జాతి విమోచన కొరకు తన ప్రాణమును పెట్టి, మూడవ దినమున మరణం నుండి తిరిగి లేచాడని నమ్ముతున్నాము (హెబ్రీ 4:15; 7:26; యోహాను 1:1-14, 14:6; గలతీ 4:4; రోమా 5:8; 1 పేతురు 2:24; ఫిలిప్పీ 2:6).

త్రిత్వంలో మూడవ వ్యక్తిగా పరిశుద్ధాత్మను నమ్ముతున్నాము. విశ్వాసులకు బోధించడం, వారిని నడిపించడం, ఆదరించడం, ఒప్పించడం మరియు పరిశుద్ధపరచడమనేవి ఆయన కార్యాలుగా నమ్ముతున్నాము (మత్తయి 3:16-17; 1 పేతురు 1:2; అపొ. కా 2:38; యోవేలు 2:29; రోమా 8:14; యోహాను 4:24, 14:26; గలతీ 5:22).

లేఖనాలన్నీ దేవుని ప్రత్యక్షతని మరియు ఆయనచే ప్రేరేపించబడినవని నమ్ముతున్నాము. బైబిల్ గ్రంథకర్తలు దేవుని పర్యవేక్షణలో రాశారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై లేఖనాలన్నీ ఇవ్వబడ్డాయి (2 తిమోతి 3:15-17; 2 పేతురు 1:20-21).

మానవులందరు దేవుని స్వరూపమందు దేవునిచే సృష్టించబడ్డారని నమ్ముతున్నాము. అయినప్పటికినీ, మానవులు, వారి ఆది పితరుల పాపం వలన స్వభావసిద్ధముగా పాపులుగా మారారు (ఆది 1:26-27; రోమా 3:23, 5:12, 6:23; గలతీ 2:20; ప్రసంగి 7:29; 2 కొరింథీ 5:17).

రక్షణ అంటే పాపం నుండి మరియు దేవుని తీర్పు నుండి అంతిమ విమోచన అని, అలాగే పాపంతో దేవునికి దూరమైన మానవుడు తిరిగి క్రీస్తులో దేవునితో సమాధానపరచబడడమని నమ్ముతున్నాము. మానవుల పాపక్షమాపణ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నాము (రోమా 10:9-13; ఎఫెసీ 2:8; 1 థెస్సలో 1:6-10; తీతు 3:5).

సంఘం, విశ్వాసులతో కూడిన క్రీస్తు శరీరమని నమ్ముతున్నాము. మరియు సార్వత్రికమును అపొస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాము. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధ సంస్కారాలైన బాప్తిస్మం మరియు ప్రభు బల్లను ప్రభువు నియమించాడని నమ్ముతున్నాము (మత్తయి 16:18, 18:20; 1 పేతురు 2:9; ఎఫెసీ 2:19-20, 4:1-6; 1 కొరింథీ 12:12-14; రోమా 12:4-5).

యేసు ప్రభువు రెండవ రాకడలో పరిశుద్ధుల యొక్క అంతిమ శరీర పునరుత్థానాన్ని నమ్ముతున్నాము (1 థెస్సలో 4:13-18). రక్షించబడని ప్రజలందరు నిత్య శిక్షను పొందుతారని నమ్ముతున్నాము (ప్రకటన 22:7; యోహాను 11:25).

దేవదూతలు, దురాత్మలు ఉనికి కలిగి ఉన్నారని, వీరు ఆత్మజీవులని కూడా నమ్ముతున్నాము. వారి సామర్ధ్యం దేవునిచే నిరోధించబడుతుందని నమ్ముతున్నాము. దేవదూతలు, లోకంలో దేవుని ఉద్ధేశ్యాలను నెరవేర్చే దేవుని ప్రతినిధులుగాను, దురాత్మలు యుగాంతమందు తీర్పునొంది, నిత్యశిక్షకు లోనవుతారని విశ్వసిస్తున్నాము. (యూదా 6).

అపొస్తలుల విశ్వాస ప్రమాణము

“పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయైన మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు ఆయన బాధను పొంది సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకము లోనికి దిగెను. మూడవనాడు చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి, పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండియున్నాడు. అక్కడనుండి బ్రతికియుండు వారిని, చనిపోయినవారిని విమర్శించుటకు ఆయన వచ్చును. పరిశుద్దాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల ఐక్యమత్యమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిత్యజీవమును నమ్ముచున్నాను.. ఆమేన్.”

నైసీయా/నికేయ విశ్వాస ప్రమాణము

“సర్వశక్తి గలిగినట్టియు గోచరాగోచరములను సకలమును సృజించిన తండ్రియగు ఏక దేవునియందు విశ్వాసముంచు చున్నాము.”

“మరియు దేవుని కుమారుడును, తండ్రిచేత పుట్టింపబడిన వాడును, జనితైకుడును, ఆనగా తండ్రితో సమానమైన ఉనికి గల వాడును, దేవుని వలనైన దేవుడును, వెలుగు వలనైన వెలుగును, నిజ దేపుని వలనైన నిజ దేవుడును, చేయబడినవాడు గాక పుట్టింపబడినవాడును, భూమ్యాకాశములందలి సమస్తమును ఎవనివలన చేయబడెనో ఆ తండ్రితో సమానమైన ఉనికి గల వాడును, మనుష్యులమైన మన నిమిత్తమును మన రక్షణ నిమిత్తమును దిగివచ్చి అవతారమెత్తి నరుడై, శ్రమపడి, మూడన దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి వెళ్లి, ఆక్కడనుండి జీవించియుండువారికిని చనిపోయినవారికిని తీర్చు చేయటకు తిరిగి వచ్చు ఏక ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుచున్నాము.”

“పరిశుద్ధాత్మయందును విశ్వాసముంచుచున్నాము.” ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రినుండియు కుమారునినుండియు బయలుదేరువాడును, తండ్రితోను కుమారునితోను కూడ ఆరాధింపబడి, మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునైయున్నాడు. మరియు సార్వత్రికమును అపొస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును, పరమందలి జీవము కొరకును ఎదురుచూచుచున్నాము. ఆమేన్ !"

అతనేషియన్ విశ్వాస ప్రమాణం

త్రిత్వంలోని ఏక దేవుడిని మరియు ఏకత్వంలో త్రిత్వదేవుడిని మనం ఆరాధిస్తున్నాము. వారు వ్యక్తులుగా కలిసిపోలేదు, స్వభావంలో విడిగాను లేరు. ఎందుకంటే వారిలో తండ్రి ఒక వ్యక్తిగాను, కుమారుడు ఒక వ్యక్తిగాను, పరిశుద్ధాత్ముడు మరొక వ్యక్తిగాను ఉన్నారు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల దైవత్వం ఏకమై ఉన్నది, వారి మహిమలు సమానమైనది, వారి మాహాత్మ్యము నిత్యమైనది. తండ్రి ఎలాంటి వాడో, కుమారుడును, పరిశుద్ధాత్ముడు అలాంటి వారు.

తండ్రి, సృష్టించబడనివారు, కుమారుడు సృష్టించబడని వారు మరియు పరిశుద్ధాత్ముడు సృష్టించబడనివారు. తండ్రి అగోచరుడు (గ్రహింపశక్యము కానివాడు), కుమారుడు అగోచరుడు మరియు పరిశుద్ధాత్ముడు అగోచరుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు మరియు పరిశుద్ధాత్ముడు నిత్యుడు.

అయినప్పటికిని వారు మూడు నిత్యత్వాలు కలిగినవారు కాదు, కానీ ఒకే నిత్యత్వం కలిగిన వారు. అదేవిధంగా ముగ్గురు అగోచరులు కాదు, ముగ్గురు సృజించబడని వారు కాదు, కానీ ఒక్కడే సృజించబడని అగోచరుడు.

అదేవిధంగా, తండ్రి సర్వశక్తిమంతుడు, కుమారుడు సర్వశక్తిమంతుడు మరియు పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. అయినప్పటికిని వారు ముగ్గురు సర్వశక్తిమంతులు కాదు, కానీ ఒక్కడే సర్వశక్తిమంతుడు.

అదేవిధంగా, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు మరియు పరిశుద్ధాత్ముడు దేవుడు. అయినప్పటికిని ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ఒక్కడే దేవుడు. అదే విధంగా, తండ్రి ప్రభువు, కుమారుడు ప్రభువు మరియు పరిశుద్ధాత్ముడు ప్రభువు. కానీ ముగ్గురు ప్రభువులు కాదు, ఒక్కడే ప్రభువు.

ప్రతివ్యక్తిని దేవునిగాను, వ్యక్తిగాను ఒప్పుకోవడానికి క్రైస్తవ ప్రామాణికతచే బలవంతపెట్టబడుతున్నట్లుగానే, ముగ్గురు దేవుళ్ళు లేదా ముగ్గురు ప్రభువులు ఉన్నారని చెప్పడాన్ని క్యాథలిక్ సంఘం నిషేధిస్తుంది. తండ్రిని ఎవరు సృష్టించలేదు, కనలేదు. కుమారుడు, తండ్రి నుండి వచ్చినవాడే కానీ ఎవరు ఆయన్ని తయారుచేయలేదు, సృష్టించలేదు, కనలేదు, కానీ తండ్రి నుండి వచ్చాడు.

కాబట్టి ఒక్కడే తండ్రి ఉన్నాడు కానీ ముగ్గురు తండ్రులు లేరు; ఒక్కడే కుమారుడున్నాడు కానీ ముగ్గురు కుమారులు కాదు; ఒక్కడే పరిశుద్ధాత్ముడు, కానీ ముగ్గురు పరిశుద్ధాత్ములు కాదు. ఈ త్రిత్వంలో ఎవరు ముందు కాదు లేదా తరువాత కాదు; ఎవరు గొప్పవారు లేదా ఒకరు మరొకరి కంటే తక్కువవారు కాదు; కానీ త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు నిత్యులు మరియు సమానులు. కాబట్టి, ముందు చెప్పబడినట్లుగా, అన్నీ విషయాలలో త్రిత్వంలో ఏకమైయున్న, ఏకత్వంలో త్రిత్వమైయున్న దేవునిని ఆరాధించాలి. కాబట్టి రక్షించబడిన వ్యక్తి త్రిత్వమును గూర్చి ఆలోచించాలి.

అంతేకాకుండా, ఒక విశ్వాసి తన రక్షణను నిత్యము కొనసాగించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాధరణమును కూడా సరైన విధంగా నమ్మాలి. ఎందుకంటే మనం నమ్మే, ఒప్పుకునే సరైన విశ్వాసం ఏమిటంటే దేవుని కుమారుడును, మన ప్రభువునునైన యేసుక్రీస్తు, సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు. తన తండ్రి స్వభావాన్ని బట్టి దేవుడు, జగత్తు పునాదికి ముందే జన్మించినవాడు; మరియు తన తల్లి యొక్క స్వభావాన్ని బట్టి మానవుడు, లోకంలో జన్మించినవాడు; హేతుబద్ధమైన మనసును, మానవ శరీరాన్ని కలిగిన పరిపూర్ణ దేవుడు మరియు పరిపూర్ణమానవుడు.

తన దైవత్వం విషయంలో తండ్రితో సమానుడు; తన మానవత్వం విషయంలో తండ్రికంటే తక్కువవాడు; ఆయన దేవుడు, మానవుడు అయినప్పటికిని ఇద్దరు కాదు, కానీ ఒక్కడే క్రీస్తు; దైవత్వం నుండి మానవత్వానికి మారిన వ్యక్తి కాదు, కానీ మానవత్వాన్ని దేవునిలోని తీసుకెళ్లిన వ్యక్తి; స్వభావంలో గందరగోళం ద్వారా కాదు కానీ వ్యక్తిత్వం యొక్క ఐక్యత ద్వారా కలిగిన వాడు. ఆలోచించే మనసు, శరీరం ఒక మనిషికి ఉన్నట్లుగానే, దైవత్వం మరియు మానవత్వం ఒక్క క్రీస్తులోనే ఉన్నాయి; ఈయన మన రక్షణకై చనిపోయి, పాతాళం లోనికి దిగిపోయి, మూడవ దినాన మరణంలో నుండి తిరిగి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణుడై, సర్వశక్తి మంతుడైన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. సజీవులకును, మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి రాబోతున్నాడు. అతని రాకడ సమయంలో సమస్త జనులు తమ శరీరాలతో సహ లేచి, తమ క్రియలను బట్టి దేవునికి లెక్కఅప్పగిస్తారు. వారిలో మంచి చేసిన వారు నిత్యజీవానికి వెళతారు; చెడు చేసిన వారు నిత్యాగ్ని దండనకు వెళతారు.

ఇది సార్వత్రిక సంఘ విశ్వాసం. దీనియందు నమ్మకంగా విశ్వాసముంచని వారు, రక్షణ పొందలేరు.

చాల్సిడన్ విశ్వాస ప్రమాణం

“ఇప్పుడు మనమందరం పరిశుద్ధులైన సంఘ పితరులను అనుసరించి, మన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలని మనుష్యులకు బోధించాలి. ఆయనను గూర్చి ఆదినుండి ప్రవక్తలు చెప్పినట్లుగాను, ప్రభువైన యేసుక్రీస్తు తనను గూర్చి తాను మనకు బోధించినట్లుగాను మరియు పరిశుద్ధులైన సంఘపితరులు మనకు అందించిన విశ్వాస ప్రమాణాల ఆధారంగాను, ఈయన దైవత్వంలోను మరియు మానవత్వంలోనూ అదే పరిపూర్ణత కలిగినవాడు; హేతుబద్దమైన మనసు మరియు శరీరం కలిగిన నిజమైన దేవుడును, నిజమైన మానవుడునై ఉన్నాడు; దైవత్వమును బట్టి తండ్రితో సమానుడు మరియు మానవత్వమును బట్టి మనతో సమానుడు; సమస్త విషయాలలో మనవంటి వాడైనప్పటికిని, పాపంలేనివాడు; దైవత్వమును బట్టి, సకల యుగముల కంటే ముందే తండ్రికి అద్వితీయకుమారుడునైయున్నాడు; మానవత్వమును బట్టి, ఈ అంత్యదినములలో మన కొరకు మరియు మన రక్షణ కొరకు, దేవుని తల్లియైన కన్యమరియకు జన్మించాడు; ఈయనే క్రీస్తు, కుమారుడు, ప్రభువు, జనితైకుడు, గందరగోళం లేని, మార్పు చెందని, విభజించబడని, వేరుచేయలేని రెండు స్వభావాలు కలిగిన వాడిగా అంగీకరించబడినవాడు; ఈ రెండు స్వభావాల యొక్క భినత్వం, వాటి ఐక్యతద్వారా తీసివేయబడలేదు, కానీ ప్రతి స్వభావం యొక్క గుణం సంరక్షించబడి, ఒక వ్యక్తిలో మరియు ఒక జీవంలో ఇద్దరు వ్యక్తులుగా విభజించబడకుండాను మరియు వేరుచేయబడకుండా ఏకీభవించి ఉన్నాయి, కానీ ఈయన ఒక్కడే అదే కుమారుడు, జనితైకుడు, వాక్యమైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు."

సంఘ సంస్కర్తలు ప్రతిపాదించిన ఐదు పునాది సత్యాలు (5 Solas of Reformation)

  • వాక్యం మాత్రమే (Sola Scriptura: by Scripture Alone)
  • క్రీస్తులో మాత్రమే (Solus Christus: through Christ Alone)
  • విశ్వాసము ద్వారా మాత్రమే (Sola Fide: by Faith Alone)
  • కృప ద్వారా మాత్రమే (Sola Gratia: by Grace Alone)
  • దేవునికి మాత్రమే మహిమ (Soli Deo Gloria: Glory to God Alone)

కీలక విషయాలపై మా నమ్మకాలు

1. మద్యపానం

మద్యపానం ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉంటుంది మరియు వ్యక్తి యొక్క శరీరాన్ని దుర్వినియోగ పరుచుటకు నడిపిస్తుంది కనుక మద్యాన్ని క్రైస్తవులు సేవించకూడదనేది మా నమ్మకం. కొన్ని స్థలాలలో లేఖనాలు దీనిని సంపూర్ణంగా ఖండించినట్లు కనిపించక పోయినప్పటికిని (ప్రసంగి 9:7; కీర్తన 104:14-15; మత్తయి 26:27-29; లూకా 7:33-34; యోహాను 2:9; 1 తిమోతి 5:23), అవి మద్యపానం వలన కలిగే దుష్ఫలితాలను గూర్చి ఖచ్చితంగా ప్రస్తావించాయి. అదనంగా, దీని నుండి దూరంగా ఉండడం వలన కలిగే సానుకూల ప్రయోజనాలను వివరించిన లేఖన భాగాలు కూడా ఉన్నాయి (సంఖ్యా. 6:2-4; సామెతలు 20:1; 23:31; లూకా 21:34; 1 కొరింథీ 6:10, గలతీ. 5:2; ఎఫెసీ 5:18; 1 పేతురు 4:3). బైబిల్, మద్యపానాన్ని పాపం అని పిలుస్తుంది కనుక, మా అభిప్రాయంలో పాపంలోనికి నడిపించే దీనినుండి దూరంగా ఉండడం వివేకం.

2. పొగత్రాగుట

మా ఉద్ధేశ్యం ప్రకారం, పొగ త్రాగడం, మద్యం సేవించడంతో సమానమైనది. పొగాకులో, వ్యక్తిని వ్యసనపరుడిగా మార్చే పదార్ధాలు ఉన్నాయి కనుక, దానిని ఏ రూపంలోను ఉపయోగించకపోవడం మంచిది. “ అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు,” (1 కొరింథీ 6:12) అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఈవిషయంలో చక్కని హెచ్చరికలుగా భావిస్తున్నాము.

3. వివాహాం

కుటుంబం, దేవునిచే స్థాపించబడిన ప్రాథమిక వ్యవస్థ అని మేము నమ్ముతున్నాము. కనుక, ఒక పురుషుడు, ఒక స్త్రీతోనే తన జీవితకాలం వివాహ సంబంధాన్ని కలిగి ఉండాలి (ఆది. 2:24). స్త్రీ, పురుషుల ఆత్మ గౌరవం విషయంలో వ్యత్యాసాలు లేకపోయినప్పటికినీ, కుటుంబంలో వారికి ఇవ్వబడిన వ్యక్తిగత బాధ్యతల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. భర్తలు కుటుంబాన్ని నడిపించాలి, భార్యలు సహకారులుగా ఉండాలి. భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య, తన భర్తకు లోబడి ఉండాలి.

ముఖ్యమైన బైబిల్ వచనాలు : ఆది. 2:24; మత్తయి 19:5; ఎఫెసీ. 5:31.

4. విడాకులు

వివాహ బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషులు, వివాహంలోను, లైంగిక సంబంధంలోను నమ్మకంగా ఉండకపోవడాన్ని బట్టి తప్పా, మరే కారణంతోను విడిపోకూడదు. ముఖ్య బైబిల్ వచనాలు : మత్తయి 19:9; మార్కు 10:12; మలాకీ 2:16; 1 కొరింథీ 7:11, 15.

5. పునర్వివాహం

ఒక వ్యక్తి యొక్క భాగస్వామి చనిపోయిన సంధర్భంలోను లేక లైంగికపరంగ విశ్వసనీయత కోల్పోయినప్పుడు మాత్రమే పునర్వివాహన్ని లేఖనం అనుమతిస్తుంది అనేది మా అభిప్రాయం. ముఖ్య బైబిల్ వచనాలు : మత్తయి 19:9; రోమా 7:2-3; 1 కొరింథీ 7:39; 1 తిమోతి 3:2,12.

6. వివాహానికి ముందు లైంగిక విషయాలు

శృంగారమనేది వివాహ బంధం ద్వారా ఏకమైన స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే కలిగియుండుటను గూర్చి బైబిల్ బోధిస్తుందని నమ్ముతున్నాము. కాబట్టి, వివాహానికి ముందు లేక వెలుపల జరిగే శృంగారం పాపపు చర్యగా భావిస్తున్నాము. ముఖ్య బైబిల్ వచనాలు : ఆది. 2:24; మార్కు 10:6-9; ఎఫెసీ 5:3; హెబ్రీ 13:4.

7. వివాహానికి వెలుపల లైంగిక కార్యకలాపాలు

బైబిల్, వివాహానికి వెలుపల జరిగే శృంగార కార్యకలాపాలను పాపంగా ఖండిస్తుంది మరియు దాని నుండి పారిపొమ్మని విశ్వాసులను హెచ్చరిస్తున్నది. లైంగిక అనైతికత ఏ రూపంలో ఉన్న అది బైబిల్ ప్రామాణిక జీవితానికి విరుద్ధమైనది మరియు వ్యక్తి స్వీయ నియంత్రణ కలిగి లేడని చూపిస్తుంది. ముఖ్య బైబిల్ వచనాలు : 1 కొరింథీ 6:13-20; మత్తయి 5:28; 1 థెస్సలో 4:3-5.

8. సహజీవనం

సహజీవనంలో స్త్రీ, పురుషులు వివాహా నిబంధనకు వెలుపల కలిసి జీవిస్తారు కనుక ఖచ్చితంగా ఇది వాక్యవిరుద్ధమైన చర్యగా భావిస్తున్నాము. స్త్రీ, పురుషులు ఈ విధంగా జీవించాలని దేవుడు ఉద్ధేశించలేదు. కేవలం వివాహానంతరం మాత్రమే వ్యక్తి అతని/ఆమె కుటుంబాన్ని విడిచి, తన భార్యతో కుటుంబాన్ని ప్రారంభిస్తాడు. ముఖ్య బైబిల్ వచనాలు : ఆది 2:24; హెబ్రీ 13:4, 1 కొరింథీ 6:18, 7:2.

9. భ్రూణహత్యలు

పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అని బైబిల్ స్థిరంగా చెబుతుంది. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు, గర్భంలో ఉన్న శిశువు ఒక సంపూర్ణ వ్యక్తితో సమానం, కనుక ఆ శిశువుని చంపడం హత్యతో సమానం. అందువలన, గర్భంలో ఉన్న శిశువుని దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తిగా పరిగణించి, సంరక్షించాలి. ముఖ్య బైబిల్ వచనాలు : కీర్తన 139:13`16; 127:3-5; 22:10; ఆది 1:27; యిర్మీయా 1:5; యోబు 31:15; యెషయా 44:24; గలతీ 1:15; ఎఫెసీ 1:3-4; లూకా 1:41, 2:6-7.

10. స్వలింగ సంపర్కం :

స్వలింగ వివాహం అనేది బైబిల్ బోధను ప్రత్యక్షంగా విభేదిస్తుంది (రోమా 1:18). స్వలింగ సంపర్కం అనేది పాప ఫలితంగా వచ్చిందని మరియు దీనిని పాపంగ బైబిల్ నిర్ధారిస్తుంది. అయినప్పటికిని, స్వలింగ సంపర్కంలో ఉన్న వారు పశ్చాత్తాపపడి, దేవుని క్షమాపణను వెదికినట్లయితే, ఇతరుల వలె రక్షించబడవచ్చు. ముఖ్య బైబిల్ వచనాలు : రోమా 1:18; 1 కొరింథీ 6:13-20; మత్తయి 5:28; 1 థెస్సలో 4:3-5.

11. అశ్లీలత

ఒక వ్యక్తిని, స్వయం – సంతృప్త లైంగిక అనైతికతలోనికి నడిపించే ఇతర విషయాలలో అశ్లీలత ఒకటి. ఇది వివాహం మరియు లైంగిక జీవితం పట్ల దేవుని ప్రణాళిక నుండి మనల్ని దారి మళ్ళిస్తుంది. ఇది కామాన్ని, మోహాన్ని ప్రేరేపిస్తుంది కనుక వ్యభిచారంతో సమానం. అశ్లీలత, ఒక వ్యక్తిపైనను, అతని సంబంధాలపైనను ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వివిధ రూపాల్లో నిరూపించబడుతుంది. ముఖ్యమైన బైబిల్ వచనాలు : మత్తయి 5:27-28; 1 కొరింథీ 6:18; 1 థెస్సలో 4:3-5.

12. ఆర్ధిక విషయాలు :

అప్పులు తీసుకోవడం పాపం కాకపోయినప్పటికిని, మనకివ్వబడిన వనరుల విషయమై మంచి గృహ నిర్వాహకులముగా ఉండాలని బైబిల్ మాట్లాడుతుంది. వనరులన్నీ దేవునికి చెందినవే, కనుక వాటి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఒక వ్యక్తి సంతృప్తి కలిగి జీవిస్తూ, సాధ్యమైనంత మట్టుకు అప్పులు లేకుండా చూసుకోవాలని మేము నమ్ముతాము. ఒకవేళ అప్పు తీసుకున్నట్లయితే, అతను దానిని సమయానికి చెల్లించి, అప్పులేని వ్యక్తిగా ఉండాలి (కీర్తన 37:21). ముఖ్యమైన వచనాలు : ద్వితీయో 8:18; కీర్తన 37:21; సామెతలు 13:22; లూకా 14:28; రోమా 13:7, 8; ఫిలిప్పీ 4:19.

About Us